నీటిచుక్క జాడలేనిచోట అడవినే సృష్టించాడు... పర్యావరణం పీక నులిమే మైనింగ్ మాఫియాపై పోరాడుతున్నాడు... జలసిరిని ఒడిసి పట్టి చెరువులకు జీవకళ తెస్తున్నాడు... సవాళ్లు ఎదురైనా.. కష్టాలు అడ్డొచ్చినా... ప్రకృతిపై మమకారంతో ఎంచుకున్న మార్గం వీడని ఆ సేలం యువకుడు పీయూష్ మానుష్... పారిస్ వాతావరణ సదస్సు ముగిసిన నేపథ్యంలో.. ముందే చర్యలు చేపట్టిన ఆ పర్యావరణహితుడితో మాట కలిపింది ఈతరం.సందర్భం 1: తమిళనాడులోని సేలం, ధర్మపురి జిల్లాల సరిహద్దు. రాళ్లూరప్పలతో ఎడారిని తలపించే ప్రాంతం. కనుచూపుమేరలో నీటిచుక్క కనిపించేది కాదు. ఎనిమిదేళ్ల కిందటి సంగతి అది.సందర్భం 2: ప్రస్తుతం 250 ఎకరాల్లో రకరకాల పండ్లతోటలు, వెదురువనంతో అడవిని తలపిస్తోంది అదే ప్రాంతం. అనుబంధంగా ఏర్పాటైన వెదురు పరిశ్రమతో వందలమందికి ఉపాధి దొరుకుతోంది.
సందర్భం 2: మొక్క మొలవని చోట అడివినే సృష్టించిన ఆ అపర భగీరథుడు పీయూష్ మానుష్ సేథియా. ఇది పర్యావరణ సేవ కాదు.. ‘ఫారెస్ట్ ఫర్ ప్రాఫిట్ ఉద్యమం’ అంటాడు పీయూష్.
ముందే మేల్కొన్నాడు
పోరాడటం పీయూష్‌కి మొదట్నుంచీ అలవాటే. కాలేజీలో జరుగుతున్న అక్రమాలపై తోటి విద్యార్థులను కూడగట్టి గళమెత్తాడు. ఫలితం ఓ హత్యకేసులో అకారణంగా ఇరికించారు. దాన్నుంచి బయటపడేసరికి విద్యా సంవత్సరం ముగిసింది. డిగ్రీ పట్టా అందుకోకుండానే కాలేజీ నుంచి బయటికొచ్చాడు. నాన్న వస్త్రవ్యాపారంలోకి వెళ్లడం ఇష్టం లేదు. పర్యావరణ ప్రేమికుడు కావడంతో సేలం పట్టణమంతా తిరుగుతూ మొక్కలు నాటేవాడు. తర్వాత అరెకాపామ్ ఆకుల నుంచి ప్లేట్లు తయారు చేసే చిన్న యూనిట్ ప్రారంభించాడు. సేంద్రీయ ఎరువులు తయారు చేసి అమ్మేవాడు. ఆ విజయాలు పర్యావరణానికి హాని కలిగించని ఎన్నో వ్యాపారాలు చేయొచ్చనే స్ఫూర్తినిచ్చాయి. ఈ క్రమంలో నిత్యానంద్ జయరామన్, రవి రెబ్బప్రగడ, సతినాథ్ సారంగిల నుంచి ప్రేరణ పొందాడు. మైనింగ్ కంపెనీలకు వ్యతిరేకంగా, ఆదివాసీల తరపున, భోపాల్ గ్యాస్ బాధితుల పక్షాన పోరాడుతున్న ఉద్యమకారులు వాళ్లు. వాళ్లిచ్చిన ప్రోత్సాహంతో నేరుగా ప్రకృతితో మమేకం అయ్యే కార్యం తలపెట్టాలనుకున్నాడు.
వనం సృష్టించాడు
ధర్మపురి, సేలం జిల్లాల సరిహద్దుల్లో ఎకరన్నర స్థలం కొనుగోలు చేశాడు. గుట్టలు, రాళ్లతో నిండి ఉండేదాచోటు. వ్యవసాయం చేస్తానంటే అంతా నవ్వారు. పట్టించుకోలేదు. ఆ ప్రాంతాన్ని చదును చేసి సేద్యం మొదలుపెట్టాడు. పై ప్రాంతంలో చిన్నచిన్న ఆనకట్టలు నిర్మించాడు. ఇంకుడుగుంతలు తవ్వాడు. నాలుగేళ్ల శ్రమతో నిర్జీవమైన నేలలో భూసారం పెంచాడు. జామ, సీతాఫలం, యాపిల్, సపోటా మొక్కలు నాటాడు. వెదురువనం పెంచాడు. ఎనిమిదేళ్లు కష్టపడి నిర్జీవమైన నేలను కారడవిలా మార్చేశాడు. కొన్నాళ్లకు పర్యావరణ ఉద్యమకారుడు నిత్యానంద్ జయరామన్‌తోపాటు మరికొందరు చేతులు కలిపారు. వారితో ‘సేలం సిటిజన్స్ ఫోరమ్ (ఎస్‌సీఎఫ్)’ ప్రారంభించాడు. ఇప్పుడు ఎస్‌సీఎఫ్‌లో వందలమంది సభ్యులు. మూడేళ్ల కిందట వెదురు అనుబంధ పరిశ్రమ కూడా ప్రారంభించాడు పీయూష్. ప్లాస్టిక్ కుర్చీలు, టేబుళ్లులాంటి వాటికి ప్రత్యామ్నాయంగా, పర్యావరణానికి మేలు కలిగే విధంగా వెదురుతో గృహోపకరణాలు తయారు చేస్తోంది ఆ పరిశ్రమ. చుట్టుపక్కల గిరిజనులు, గ్రామస్తులకూ ఉపాధి కల్పిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో కొంతవరకు వలసలు ఆగాయి.
వెనకడుగు వేయడు
మొక్కలు నాటడం.. ఉపాధి కల్పించడమే కాదు.. పర్యావరణానికి పాతరేసే చర్యలను నిలువరించే ప్రయత్నం చేస్తోంది సేలం సిటిజన్స్ ఫోరమ్. సేలంకు 14 కిమీల దూరంలో కంజమళై కొండలున్నాయి. అక్కడ నాణ్యమైన ఇనుప ఖనిజాలున్నాయని 2008లోనే గుర్తించారు. వాటిని బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధమైంది. దాన్ని అడ్డుకుంటూ ఉద్యమం లేవదీశాడు పీయూష్. గనుల తవ్వకంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుందనీ, తమ జీవితాలు నాశనం అవుతాయనీ స్థానికుల్లో చైతన్యం కలిగించాడు. అటవీశాఖ జిల్లా కార్యాలయం ముందు ధర్నాలు చేశాడు. సమాచారహక్కుతో అడుగడుగునా అడ్డుపడ్డారు. సహజంగానే మైనింగ్ కంపెనీల కంట్లో నలుసులా మారాడు. వాళ్ల కుట్రల ఫలితంగా రాజద్రోహం కింద అరెస్టై జైలుకెళ్లినా పోరాటం ఆపలేదు.
చెరువుల రక్షణ
వాతావరణ సమతౌల్యంలో చెరువులదీ కీలకపాత్రే. ఎస్‌సీఎఫ్ చెరువుల సంరక్షణను ఉద్యమంలా చేపట్టింది. సేలం పక్కనుండే మూకనెరి చెరువు గతంలో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి ఓ మురుగునీటి మడుగులా, డంపింగ్‌యార్డులా ఉండేది. పట్టణ మురుగునీరు సైతం అందులోకే మళ్లించేవారు. ఇప్పుడు మూకనెరి 58 ఎకరాల్లో విస్తరించిన సుందర సరస్సు. చుట్టుపక్కల జనాలు సేదతీరే ఆహ్లాద కేంద్రం. అరుదైన పక్షిజాతులకు ఆలవాలమైన ప్రదేశం. ఈ స్థితికి తీసుకురావడానికి ఎనిమిది నెలలు కష్టపడ్డాడు పీయూష్. స్థానికుల భాగస్వామ్యంతో ఎవరూ చెరువులో చెత్త వేయకుండా అనుక్షణం కాపలా కాశారు. పట్టణ పాలకసంస్థలోని వివిధ విభాగాలతో పోరాడి మురుగును మళ్లించాడు. ఇదే ఉత్సాహంతో మరో ఏడు చెరువులను బాగు చేశారు.
సేవలు కొనసాగుతున్నాయ్
ప్రకృతిని ఆరాధించేవారు కోట్లలో ఉంటారు. దాన్ని సంరక్షించడానికి పీయూష్‌లా పోరాడేవారు అతికొద్దిమందే. ప్రస్తుతం ‘అయ్యప్పన్ వనమ్ ప్రాజెక్టు’ పేరుతో అడవులు పెంచుతోంది ఎస్‌సీఎఫ్. దీని కోసం ప్రత్యేకంగా సహకార సంఘాలు ఏర్పాటు చేస్తున్నారు. యజ్ఞంలా చెరువుల మరమ్మతులు చేస్తున్నారు. ప్రతి నీటిచుక్కను ఒడిసి పడుతూ జలసంరక్షణ చర్యలు చేపడుతున్నారు. సదాశయంతో మంచి పనికి పూనుకున్నా చాలా అవాంతరాలే ఎదుర్కొన్నాడు పీయూష్. బెదిరింపులకు గురయ్యాడు, జైలు పాలయ్యాడు. ‘వీటిని నేనెపుడూ కష్టాలని భావించను. ఈ సవాళ్లు ఎదుర్కొన్నపుడు భలే మజాగా ఉంటుంది. ఇంకా పట్టుదలగా పోరాడలనే ఉత్సాహం వస్తుంది’ అంటాడు. ‘మహావీరుడు.. బుద్ధుడు.. అయ్యప్ప జ్ఞానసముపార్జన కోసం అడవుల్లోకి వెళ్లారు. మనం అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా వాటిని నరికేస్తున్నాం. ఆ అధికారం మనకు లేదు. మనకు అందిన ప్రకృతి సంపదను అంతే జాగ్రత్తగా భావితరాలకు అందించడం మన కర్తవ్యం. అలా చేసినపుడే కరువు కాటకాలు, చెన్నై వరదల్లాంటి విపత్తులకు గురి కాకుండా ఉంటాం’ అంటాడు. ఎనిమిదేళ్ల కిందట పీయూష్ ఒక్కడే. ఇప్పుడు అతడి వెనక వేలమంది ఉన్నారు. సేలంలో తన గురించి తెలియనివారుండరు. ఓ ప్రముఖ ఛానెల్ అతడ్ని ‘రియల్ హీరో ఆఫ్ తమిళనాడు’గా పొగుడుతూ డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. పలు సంస్థలు పురస్కారాలు, అవార్డులు ఇస్తామన్నా తిరస్కరించాడు పీయూష్.
No comments:
Post a Comment